Breaking News

కెనడాలో విషాదం: దుండగుడి కాల్పుల్లో భారతీయ విద్యార్థిని మృతి

కెనడాలోని ఒంటారియోలోని హామిల్టన్ నగరంలో బుధవారం మోహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్‌ రంధవా (వయస్సు 21) అనే విద్యార్థిని, బస్టాప్ వద్ద వేచిచూస్తుండగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హర్‌సిమ్రత్‌ రంధవా మృతి


Published on: 19 Apr 2025 11:58  IST

కెనడాలో ఓ దురదృష్టకర ఘటన జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యార్థిని మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ, ఆమె కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే — ఈ ఘటన కెనడాలోని ఒంటారియోలోని హామిల్టన్ నగరంలో బుధవారం చోటు చేసుకుంది. మోహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్‌ రంధవా (వయస్సు 21) అనే విద్యార్థిని, బస్టాప్ వద్ద వేచిచూస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఓ అనుమానితుడు కారులో వచ్చి, బస్టాప్‌ వద్ద ఆగి ఉన్న మరో వాహనంపై ఆకస్మికంగా కాల్పులు జరిపాడు. అయితే, అక్కడే నిల్చున్న హర్‌సిమ్రత్‌కి ఒక బుల్లెట్ తగిలింది.దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటన తర్వాత కాల్పులు జరిపిన వాహనంతో సహా రెండు వాహనాలు అక్కడి నుంచి పారిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవలి కాలంలో కెనడాలో భారతీయులపై మరియు హిందూ ఆలయాలపై జరిగిన దాడులు ప్రవాస భారతీయుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. కొన్నిరోజుల క్రితమే ఓ భారతీయుడిని కత్తితో హత్య చేశారు. తాజాగా ఈ కాల్పుల ఘటనతో వారు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది. భారతీయులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి