Breaking News

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ మిస్సైల్‌ను గాల్లోనే ధ్వంసం చేసిన భారత్‌

ఆపరేషన్ సిందూర్ తర్వాత పంజాబ్‌లోని అనేక ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు, కొన్ని తెలియని పరికరాలు పడిపోయినట్లు నివేదికలు వచ్చాయి.


Published on: 08 May 2025 13:47  IST

ఆపరేషన్ సిందూర్ ముగిసిన తర్వాత పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం రాత్రి బటిండా జిల్లాలోని అకాలియా గ్రామంలోని గోధుమ తోటలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. బాధితులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో యుద్ధవిమానం కూలినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నా, అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా రాలేదు.

ఇక అమృత్‌సర్‌ ప్రాంతంలో భద్రతా పటిష్టత పెంచారు. అక్కడి గ్రామాల్లో మిస్సైల్ శకలాలు లభ్యమవడం కలకలం రేపింది. అందుతున్న సమాచారం ప్రకారం, పాకిస్థాన్ అమృత్‌సర్‌పై మిస్సైల్ దాడికి యత్నించినట్టు భావిస్తున్నారు. అయితే భారత భద్రతా వ్యవస్థ అప్రమత్తంగా ఉండటంతో, ఆ మిస్సైల్‌ను గాల్లోనే ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. యాంటీ మిస్సైల్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రమాదాన్ని భారత్‌ నిరోధించగలిగింది.

అమృత్‌సర్‌ సమీపంలోని దుధాల, జేతువాల్, పంధేర్ గ్రామాల్లో మిస్సైల్ ముక్కలు లభ్యమయ్యాయి. గ్రామీణ ఎస్‌ఎస్‌పి మణీందర్ సింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. సమాచారం అందుకున్న సైనిక బృందం వెంటనే అక్కడికి చేరుకుని శకలాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనల నేపథ్యంలో అమృత్‌సర్‌ ప్రాంతంలో గురువారం రాత్రంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో పోలీసులు హైఅలర్ట్‌కు సిద్ధమయ్యారు. అధికారుల సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.

ఇక మరోవైపు, హాజీపూర్‌ బ్లాక్‌లోని ఘగ్వాల్ గ్రామంలో గీజర్ ఆకారంలో ఉన్న ఓ గుర్తుతెలియని పరికరం ఆకాశం నుండి ఒక ఇంటి ప్రాంగణంలో పడిపోయింది. అర్ధరాత్రి 1:30 సమయంలో సంభవించిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఆ పరికరంపై “టెస్ట్ పోర్ట్ సీకర్” అనే ఇంగ్లీషు పదాలు కనిపించగా, ఒక సీరియల్ నంబర్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వింత ఆకారంలో ఉన్న ఆ వస్తువు పడినప్పుడు భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు తెలిపారు.

ప్రస్తుతం ఈ సంఘటనలన్నింటి మీద భద్రతా అధికారులు, నిపుణులు విచారణ జరుపుతున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ప్రతి చిన్న సమాచారం పైనా నిఘా కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి