Breaking News

హైదరాబాద్‌ నగరంలో బోర్లు అడుగంటుతున్నా అధికారులు నీటిని ఎలా తెస్తున్నారు?

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులలో నీటి మట్టాలు కొంత తగ్గినా, పూర్తిగా అడుగలేదు. అత్యవసర పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌ నుంచి నీరు తెప్పించేందుకు సిద్ధంగా ఉంది వాటర్ బోర్డు.


Published on: 16 Apr 2025 12:17  IST

హైదరాబాద్ నగరంలో వేసవి తీవ్రత పెరుగుతోంది. వాతావరణం వేడెక్కడంతో నీటి అవసరం మరింత పెరిగింది. దీంతో మోటార్ల సహాయంతో నల్లా నీరు తీసుకుంటే జరిమానాలు విధిస్తామని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది.కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. సామర్థ్యం ఉన్న వారు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. కానీ వీటికి అవసరమైన నీరు ఎక్కడి నుంచి వస్తోంది అనేది ఎంతోమందికి తెలియదు.

హైదరాబాద్‌కు తాగునీరు ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల నుంచే వస్తోంది. నగరం కృష్ణా నదీ ప్రాంతానికి చెందినదే కావడంతో ఆ నది నుండి మంచి మొత్తంలో నీరు పొందుతోంది. మిగిలిన భాగం గోదావరి నుండి వస్తోంది.

ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో నీటి కోసం ఎక్కువగా జంట జలాశయాలు, మంజీర ప్రాజెక్టులపై ఆధారపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది – కొత్త వనరులు అభివృద్ధి అయ్యాయి.

  • జంట జలాశయాలు: 40 మిలియన్ గాలన్ల సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం వాటిని వాడటం లేదు.

  • సింగనూరు: పూర్తిస్థాయిలో 75 మిలియన్ గాలన్ల నీరు సరఫరా అవుతోంది.

  • మంజీర: సామర్థ్యం 45 గాలన్లు అయినా, ప్రస్తుతం 30 మిలియన్ గాలన్లు తీసుకుంటున్నారు.

  • అక్కంపల్లి, ఎల్లంపల్లి: ఇవి కృష్ణా, గోదావరి నీటి ప్రాజెక్టులకు చెందినవే.

సింగనూరు, మంజీరలో కొంత గ్రావిటీ, కొంత పంపింగ్ ఆధారంగా నీరు వస్తుంటే, కృష్ణా, గోదావరి నీరు పూర్తిగా పంపింగ్ మీదే ఆధారపడి ఉంది. నగర శివార్లలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు ఈ నీటిని తరలించి, శుద్ధి చేసి నగరంలోని ఇంటింటికీ, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి రోజుకు సుమారు 1,800 మిలియన్ లీటర్లు (సుమారు 63.57 ఎంసీఎఫ్‌టీ) నీరు సరఫరా అవుతోంది. దాదాపు 13 లక్షల కనెక్షన్లకు ఈ నీరు అందుతోంది.

భవిష్యత్తు అవసరాల కోసం ముందస్తు ప్రణాళికలు

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులలో నీటి మట్టాలు కొంత తగ్గినా, పూర్తిగా అడుగలేదు. అత్యవసర పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌ నుంచి నీరు తెప్పించేందుకు సిద్ధంగా ఉంది వాటర్ బోర్డు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, గోదావరి నుంచి నీరు తెచ్చే GDWS ఫేజ్‌–2 ప్రాజెక్టుకు 2024 ఆగస్టులో అనుమతులు మంజూరయ్యాయి. మల్లన్నసాగర్‌ నుంచి 20 టీఎంసీల నీటిని జంట జలాశయాల్లోకి తరలించే ప్రణాళికను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తయితే, మరో 25 ఏళ్లపాటు నీటి కొరత ఉండదు అన్నది ప్రభుత్వ అంచనా.

ఒకవైపు తాగునీటి కొరత ఇంకా  కనిపించకపోయినా, నీటి వాడకంలో ఆచితూచి ఉండాల్సిన అవసరం ఉంది. నిత్యం వృథా అవుతున్న నీరు, అధికంగా నీరు వినియోగిస్తున్న నిర్మాణ సంస్థలు భూగర్భ జలాలపై ప్రభావం చూపుతున్నాయి.ఈ నేపథ్యంలో, పాత మంజీర పైపులైన్‌ను పునరుద్ధరించేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తోంది. నగరానికి బెంగళూరు తరహాలో తీవ్రమైన నీటి కష్టాలు రావొద్దని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి