Breaking News

మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో, మొత్తం 14 మంది మావోయిస్టులు అధికారులకు లొంగిపోయారు.


Published on: 24 Apr 2025 18:10  IST

హన్మకొండ: మావోయిస్టు ఉద్యమానికి తెలంగాణలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో, మొత్తం 14 మంది మావోయిస్టులు అధికారులకు లొంగిపోయారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, లొంగిపోయినవారిలో ఇద్దరు ఏరియా కమిటీ స్థాయి నేతలు కాగా, మిగిలిన 12 మంది మిలీషియా సభ్యులు. వీరిలో 13 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు కాగా, ఒకరు తెలంగాణకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ప్రభుత్వ విధానాలను ఆమోదిస్తూ, నూతన జీవనానికి అడుగుపెట్టిన వీరికి ప్రోత్సాహకంగా ప్రతి ఒక్కరికి రూ.25,000 చొప్పున రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ, ఇటీవల కర్రెగుట్ట అటవీప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌కు తెలంగాణ పోలీసులకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల చొరబాటు సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వేల సంఖ్యలో సిబ్బంది కర్రెగుట్ట ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇందులో భారత వాయుసేన కూడా కీలక పాత్ర పోషిస్తోంది. 'ఆపరేషన్ కగార్' చివరి దశలోకి ప్రవేశించినట్లు సమాచారం.

ఇక మావోయిస్టు నేతలు కేంద్రానికి లేఖ రాసి ఈ ఆపరేషన్ నిలిపివేయాలని కోరినా, కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. గురువారం ఉదయం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి