Breaking News

రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు క్యాంపస్‌లో బోను ఏర్పాటు

బోనులో చిరుత చిక్కడంతో తృటిలో తప్పిన ప్రమాదం ఊపిరిపీల్చుకున్న ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు, సిబ్బంది


Published on: 17 Apr 2025 14:29  IST

హైదరాబాద్‌ శివార్లలో ఉన్న అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) పరిసరాల్లో చిరుత సంచారం భయాందోళనకు గురిచేసింది. గత రెండు మూడు రోజులుగా శాస్త్రవేత్తలు, సిబ్బంది చిరుతను కనిపెట్టినట్టు సమాచారం. వెంటనే అటవీశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేయడంతో, వారు బుధవారం (ఏప్రిల్ 16) ఉదయం రంగంలోకి దిగారు.

సీసీ కెమెరాలు, బోను ఏర్పాటు చేసిన అటవీ శాఖ, చివరకు చిరుతను బోనులో పట్టుకునేలా ఏర్పాట్లు చేసింది. బోనులో చిరుత చిక్కడంతో భారీ ప్రమాదం తప్పినట్లు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ మగ చిరుతను హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అది సుమారు ఐదు నుంచి ఆరు ఏళ్ల వయసు ఉండవచ్చని అంచనా.అయితే, మరో చిరుత కూడా ఇక్రిశాట్ క్యాంపస్‌లో తిరుగుతోందన్న అనుమానం ఉంది. గతంలోనూ 2014, 2019లో ఇక్కడ చిరుతలు చిక్కిన ఘటనలు నమోదయ్యాయి.

ఇక నగర పరిసర ప్రాంతాల్లో చిరుతల చలనం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్, శంషాబాద్, హిమాయత్‌సాగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తున్నట్టు నివేదికలు వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతను చూసినట్లు స్థానికులు చెబితే, అటవీశాఖ అధికారులు దాని పాదముద్రలు సేకరించడానికి ప్రయత్నించారు.

నగర శివార్లలో అడవులు తగ్గిపోవడం, చిరుతలకు అవసరమైన ఆహారం కోసం అవి మానవ నివాస ప్రాంతాలకు రావడం వంటి కారణాల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక్రిశాట్ లాంటి విశాలమైన ప్రదేశాల్లో చిన్న జంతువులు ఉండడం వల్ల చిరుతలు అక్కడికి ఆకర్షితమవుతున్నట్లు కూడా వారు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి