Breaking News

ఆమెపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భారీ రివార్డులు ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన మావోయిస్టు నాయకురాలైన రేణుక మృతి చెందింది.


Published on: 02 Apr 2025 14:36  IST

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్‌-దంతేవాడ జిల్లాల సరిహద్దులో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు గుమ్మడవెల్లి రేణుక (అలియాస్ భాను, అలియాస్ చైతే, అలియాస్ సరస్వతి, అలియాస్ దమయంతి) మృతి చెందారు. రేణుక మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించడంతో పాటు,రీజనల్‌ బ్యూరో ప్రెస్‌ టీమ్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిచారు.తెలంగాణ ప్రభుత్వం ఆమెపై రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

రేణుక పాత్ర

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన రేణుక, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన తర్వాత 1996లో మావోయిస్టు పార్టీలో చేరారు.

  • 2003: డివిజన్‌ కమిటీ సభ్యురాలిగా పదోన్నతి.

  • 2020: దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలిగా, రీజనల్‌ బ్యూరో ప్రెస్‌ టీమ్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు.

  • ప్రముఖ మావోయిస్టు ప్రచార పత్రికలకు సంపాదకురాలిగా కూడా పనిచేశారు.

2005లో కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావును రేణుక వివాహం చేసుకున్నారు. అయితే, 2010లో నల్లమల్ల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అప్పారావు మరణించారు.

  • రేణుక సోదరుడు జీవీకే ప్రసాద్‌ (అలియాస్‌ సుఖ్‌దేవ్‌, అలియాస్‌ గుడ్సా ఉసెండి) 2014లో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

  • తల్లిదండ్రులు సోమయ్య, జయమ్మలు హైదరాబాద్‌ అల్వాల్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు.

రేణుక మృతి విషయం తెలిసిన తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. "ఆమె మావోయిస్టు పార్టీలోకి వెళ్లినప్పటి నుంచి మాతో ఎలాంటి సంబంధాలు లేవు" అని వారు తెలిపారు. మంగళవారం ఉదయానికి రేణుక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు, ఇందుకోసం ఆమె అన్న జీవీకే ప్రసాద్‌ ఛత్తీస్‌గఢ్‌ వెళ్లారు.

Follow us on , &

ఇవీ చదవండి