Breaking News

అయోధ్య: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి

అయోధ్య: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి అండగా నిలిచింది. మతపరమైన పర్యాటకం అనూహ్యంగా పెరగడంతో ఈ భారీ మొత్తం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం వెల్లడించారు.


Published on: 18 Mar 2025 14:06  IST

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో మతపరమైన పర్యాటక వృద్ధికి విశేషమైన పాత్ర పోషిస్తోంది. గత ఐదేళ్లలో ట్రస్ట్ అక్షరాలా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి, ప్రభుత్వ ఆదాయంలో ప్రముఖ భాగస్వామిగా నిలిచింది. ఆదివారం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2020 ఫిబ్రవరి 5 నుండి 2025 ఫిబ్రవరి 5 వరకు కాలంలో ట్రస్ట్ రూ. 270 కోట్లు వస్తు, సేవల పన్ను (GST) కింద చెల్లించగా, మిగిలిన రూ. 130 కోట్లు ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరినట్లు వివరించారు. ఇది ట్రస్ట్ నిర్వహణలో పారదర్శకతకు నిదర్శనమని ఆయన తెలిపారు గత సంవత్సరంలో అయోధ్యకు 16 కోట్ల మంది సందర్శకులు రాగా, వారిలో 5 కోట్ల మంది శ్రీ రామ మందిరాన్ని సందర్శించి పులకరించారని రాయ్ తెలిపారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యొక్క ఆర్థిక లావాదేవీలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) అధికారులు ఈ లావాదేవీలను నిరంతరం తనిఖీ చేస్తున్నారని చంపత్ రాయ్ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో పన్నులు చెల్లించడం ట్రస్ట్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయ వృద్ధి జరుగుతోందని తెలిపారు.

అయోధ్య ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోందని, భక్తులు, పర్యాటకుల సంఖ్య పదింతలు పెరిగిందని రాయ్ సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్య ఒక ప్రధాన మతపరమైన పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు. మహా కుంభమేళా సమయంలో ఏకంగా 1.26 కోట్ల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నారని ఆయన గుర్తు చేశారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆలయ పరిసర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆలయం చుట్టూ శాశ్వతంగా ధార్మిక మరియు సాంస్కృతిక కార్యాక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.


ఇదిలా ఉంటే రామమందిర ప్రతిష్ట (ప్రాణ ప్రతిష్ఠ) జనవరి 22, 2024న జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.చాలా ఘనంగా నిర్వహించిన ఈ ఘట్టానికి దేశ విదేశాల నుంచి పలువురు మతపెద్దలు, రాజకీయ నాయకులు ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు.2019లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం అయిన తర్వాత, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి 2020లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది.

 

Follow us on , &

ఇవీ చదవండి