Breaking News

మన సంస్కృతి ఎన్నో పండుగలను జరుపుకునే అవకాశాన్ని ఇస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు.

మధ్యప్రదేశ్‌లో హోలీ సందర్భంగా అసెంబ్లీ సెక్రటేరియట్,సాంస్కృతిక శాఖ సంయుక్తంగా అసెంబ్లీలోని మానసరోవర్ ఆడిటోరియంలో గురువారం ఫాగ్ మహోత్సవాన్ని నిర్వహించాయి.


Published on: 21 Mar 2025 13:58  IST

మధ్యప్రదేశ్‌లో ఫాగ్ మహోత్సవం
మన భారతీయ సంస్కృతి అనేక పండుగలను ఘనంగా జరుపుకునే అవకాశం కల్పిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. ఈ ఉత్సవాలు ప్రజల మధ్య ప్రేమ, సామరస్యం పెంచేలా సహాయపడతాయని ఆయన తెలిపారు.                                                                                                     
హోలీ పండుగను పురస్కరించుకుని మధ్యప్రదేశ్ అసెంబ్లీ సెక్రటేరియట్, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా అసెంబ్లీలోని మానసరోవర్ ఆడిటోరియంలో గురువారం ఫాగ్ మహోత్సవాన్ని నిర్వహించాయి. ఈ వేడుకలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హోలీ పాటలు పాడగా  అక్కడున్న మంత్రులు అందుకు తగ్గట్లుగా డ్యాన్సులు వేశారు. ముఖ్యమంత్రి కూడా పూలతో హోలీ ఆడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఫాగ్ మహోత్సవం సందర్భంగా సీఎం మోహన్ యాదవ్  ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వం పై ప్రత్యేక సందేశాన్ని అందించారు. సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యమంత్రి స్వయంగా పాటలు పాడి మంత్రులతో పాటు ఉన్నవారందరినీ ఉత్సాహపరిచారు.

సీఎం మోహన్ యాదవ్ పాడిన "గోవిందా ఆలా రే" పాటకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటపాటలతో హోరెత్తించారు. సిరోజ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఉమాకాంత్ శర్మ సీఎం చేయి పట్టుకుని ఆయనతో కలిసి నృత్యం చేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా డ్యాన్స్ చేస్తూ సంబురంలో భాగమయ్యారు.

ఈ వేడుకలో అసెంబ్లీ స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్, ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్, ఉప ముఖ్యమంత్రులు జగదీష్ దేవ్డా, రాజేంద్ర కుమార్ శుక్లా, మంత్రులు కైలాష్ విజయవర్గియా, ప్రహ్లాద్ పటేల్, ఉదయ్ ప్రతాప్ సింగ్, సంపతియ ఉయ్కే, ఎడాల్ సింగ్ కంషన సహా అనేక మంది ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, అధికారులు, శాసనసభ ప్రధాన కార్యదర్శి ఏ.పి. సింగ్ పాల్గొన్నారు.

ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సీఎం మోహన్ యాదవ్ స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేయగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హోలీ ఉత్సవాల్లో రాజకీయ భేదాలను పక్కనపెట్టి అందరూ ఉత్సాహంగా పాల్గొన్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమని, ప్రజల మధ్య బంధాలను మరింత బలపరచే అద్భుత అవకాశమని సీఎం మోహన్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అందరూ ఆనందంగా ఉండాలని, హోలీ అందరికీ శుభం కలగజేయాలని ఆయన ఆకాంక్షించారు.

Follow us on , &

ఇవీ చదవండి