Breaking News

దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల కేసులో 12 ఏళ్ల తర్వాత కోర్టు తుది తీర్పు

దిల్​సుఖ్​నగర్​ జంట బాంబుల పేలుళ్ల కేసు - దాడిలో 18 మంది మృతి, 131 మందికి గాయాలు - 12 ఏళ్ల తర్వాత తుది తీర్పు ఇచ్చిన హైకోర్టు


Published on: 08 Apr 2025 11:53  IST

దిల్‌సుఖ్‌నగర్‌లో 2013లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో కీలక అభివృద్ధి చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో నేరస్థులుగా గుర్తించబడిన ఐదుగురికి హైకోర్టు ఉరిశిక్షను ధృవీకరించింది. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ నిందితులు హైకోర్టులో వేసిన అప్పీళ్లు తిరస్కరించబడ్డాయి.

2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్‌స్టాప్‌ వద్ద తొలి పేలుడు చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లోనే కోణార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ రెండు పేలుళ్లలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికిపైగా గాయపడ్డారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు.పేలుళ్ల కేసును ఎన్ఐఏ తీసుకుని, దర్యాప్తులో "ఇండియన్ ముజాహిదీన్" ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉందని నిర్ధారించారు. ప్రధాన నిందితులైన యాసిన్ బట్కల్, అబ్దుల్లా అక్తర్‌లను 2013లో ఇండో-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో తహసీన్ అక్తర్, జియా ఉర్ రెహమాన్ (పాకిస్థాన్ సిటిజన్), అజీజ్ షేక్‌లను కూడా ఎన్ఐఏ బృందం పట్టుకుంది. దర్యాప్తులో రియాజ్ బట్కల్ అనే వ్యక్తి ఈ కుట్ర వెనుక ప్రధాన సూత్రధారిగా గుర్తించబడ్డాడు. ప్రస్తుతం అతను పాకిస్థాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

దర్యాప్తులో భాగంగా 157 మంది సాక్షులను విచారించి ఎన్ఐఏ కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించింది. 2016 డిసెంబర్‌లో ఐదుగురిని దోషులుగా గుర్తించిన కోర్టు, వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే నిందితులు ఎన్‌ఐఏ కోర్టు తీర్పుపై అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్​పై విచారణ జరుగుతోంది.ఎట్టకేలకు నేడు హైకోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్​ చేసింది, ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది.

Follow us on , &

ఇవీ చదవండి