Breaking News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎ్‌స)కు రెడ్‌కార్పెట్‌ పరిచింది.

రుషికొండలో 21.6 ఎకరాలో 1370 కోట్లతో టీసీఎస్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ ఏర్పాటు, దశల వారీగా 12 వేల నుంచి 15వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది టీసీఎస్‌.


Published on: 16 Apr 2025 10:29  IST

విశాఖపట్నంలో ఐటీ రంగ అభివృద్ధికి గట్టి బలంగా నిలిచేలా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మద్దతు అందించింది. రుషికొండ ప్రాంతంలో టీసీఎస్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు 21.6 ఎకరాల భూమిని కేవలం 99 పైసల లీజుకు కేటాయించింది. ఇది పూర్తిగా ఉచితంగా ఇచ్చినట్టే అని చెప్పొచ్చు.

ఈ నిర్ణయాన్ని మంగళవారం రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది. టీసీఎస్‌ ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.1,370 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, దశలవారీగా 12,000 నుండి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

ఐటీ రంగాన్ని విశాఖలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గతంలోనే చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంది.

ఇంతకుముందు, టీసీఎస్‌ కోసం మిలీనియం టవర్‌-ఏ, బీ భవనాలను తాత్కాలికంగా కేటాయించినా, సంస్థ సొంత క్యాంపస్‌ కోసం ప్రత్యేక స్థలాన్ని కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అదే హిల్ నంబర్‌ 3లో 21.6 ఎకరాలను కేటాయించింది. శాశ్వత భవనాలు నిర్మించే వరకూ టీసీఎస్‌ తన కార్యకలాపాలను మిలీనియం టవర్‌ నుంచే ప్రారంభించనుంది. ఇవి రెండో, మూడో నెలల్లో ప్రారంభమయ్యే అవకాశముంది.

ఇక, టీసీఎస్‌ రాకతో విశాఖలో మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. టీసీఎస్‌ను ‘యాంకర్‌’ సంస్థగా మలచి విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో మిగతా కొన్ని ఐటీ కంపెనీలకు భూములు కేటాయించే ప్రతిపాదనలకూ మంగళవారం కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి