Breaking News

వేసవి కాలం వచ్చేసింది. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఏ ప్రదేశాలకు వెళ్లాలన్న కన్ఫూజన్ లో ఉన్నారా..?

వేసవి కాలం వచ్చేసింది. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఏ ప్రదేశాలకు వెళ్లాలన్న కన్ఫూజన్ లో ఉన్నారా..? ఐతే, ఈ 10 బెస్ట్ సమ్మర్ డెస్టినేషన్స్ గురించి తెలుసుకోండి.


Published on: 18 Mar 2025 18:40  IST

వేసవి కాలం మొదలైంది. ఈ సమయంలో సెలవులు ఉండటంతో చాలా మంది సమ్మర్ వెకేషన్‌కి ప్లాన్ చేసుకుంటారు. వేసవిలో చల్లని ప్రాంతాలకు వెళ్లాలని, ప్రకృతితో గడపాలని, ఆధ్యాత్మిక ప్రదేశాలు చూడాలని అనుకుంటారు. వీటన్నిటికీ నార్త్ ఇండియా బెస్ట్ సమ్మర్ వెకేషన్‌గా నిలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని చల్లని ప్రాంతాల నుంచి రాజస్థాన్‌లోని చారిత్రక ప్రదేశాలు, ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒకేసారి చూడొచ్చు.

మంచుతో కప్పబడిన చల్లని పర్వతాలు, ఘనమైన వారసత్వ సంపద, నేచురల్ సీనరీస్ కనువిందు చేస్తాయి. మరి, బ్యాగ్‌లు ప్యాక్ చేసుకుని ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ మరపురాని జ్ఞాపకాలను పొందేందుకు సిద్ధం కండి. నార్త్ ఇండియాలో చూడదగ్గ ఈ 10 ప్రదేశాల గురించి తెలుసుకోండి.

1)రిషికేశ్‌ని ప్రపంచ యోగా రాజధానిగా పిలుస్తుంటారు. ఆధ్యాత్మికతతో పాటు అడ్వెంచర్స్ ట్రై చేయాలంటే, ఇక్కడికి వెళ్లొచ్చు. గంగా నది ఒడ్డున ఉండే ఈ ప్రశాంతమైన పట్టణం యోగా రిట్రీట్స్, మెడిటేషన్ సెంటర్స్, రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్‌కి అనువైంది. గంగానదిలో వైట్ వాటర్ రాఫ్టింగ్, బీటిల్స్ ఆశ్రమం, లక్ష్మణ్ ఝా, రామ్ ఝాల త్రివేని ఘాట్ వద్ద గంగా హారతిని ఆస్వాదించొచ్చు.

2)ఇండియాలో బెస్ట్ హిల్ స్టేషన్లలో శిమ్లా ఒకటి. వలసరాజ్యాల వాస్తుశిల్పం, అందమైన ప్రకృతి, చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణంతో శిమ్లా టూరిస్టులను కట్టిపడేస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న శిమ్లా వేసవి విడిదికి ఎంతో అనుకూలం. ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించడం, సుందర దృశ్యాలు చూడటం, షాపింగ్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి. షాపింగ్, డైనింగ్‌కి ది రిడ్జ్ అండ్ మాల్ రోడ్, జఖూ ఆలయం, సాహస క్రీడలకు కుఫ్రి వంటివి పాపులర్.

3)మనాలి అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిల్ స్టేషన్. నార్త్ ఇండియాలో చూడదగ్గ సమ్మర్ డెస్టినేషన్స్‌లో ఇదొకటి. ఇక్కడ దట్టమైన హిమాలయ పర్వతాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రాఫ్టింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ఇది కేరాఫ్‌ అడ్రస్. బియాస్ నది పరవళ్లు, నదీ ఒడ్డున ప్రశాంతమైన పర్వతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సోలాంగ్ వ్యాలీ (పారాగ్లైడింగ్, స్కీయింగ్), రోహ్తాంగ్ పాస్, ఓల్డ్ మనాలి, హిడింబా ఆలయం చూడదగ్గ ప్రదేశాలు.

4)హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉన్న మరో చూడదగ్గ ప్రదేశం ధర్మశాల. ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక స్వర్గధామంగా వెలసిందీ ప్రాంతం. టిబెటన్ సంస్కృతిని ఇష్టపడే వారికి ఈ చోటు అనువైన ప్రదేశం. దలైలామా నివాసంగా పిలిచే ధర్మశాలకు ధ్యానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, సుందరమైన పర్వాతలు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇక్కడికి వెళ్లొచ్చు. దాల్ సరస్సు, మెక్లియోడ్ గంజ్ వంటివి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

5)ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్.. అద్భుతమైన సరస్సులు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని కొండలకు నిలయం. విశ్రాంతి తీసుకోవడానికి, బోటింగ్ చేయడానికి, ప్రకృతి మధ్య వాకింగ్ చేయడానికి, చుట్టుపక్కల పర్వత లోయల అందాలను ఆస్వాదించడానికి ఇది సరైన ప్రదేశం. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఇది బెస్ట్ డెస్టినేషన్. నైని సరస్సులో బోటింగ్, స్నో వ్యూ పాయింట్, నైనా దేవి టెంపుల్‌ చూడదగ్గ ప్రదేశాలు.

6)ఉత్తరాఖండ్‌లో ఉన్న హరిద్వార్ భారతదేశంలోని అత్యంత పవిత్ర నగరాల్లో ఒకటి. గంగా నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం తీర్థయాత్రలకు గమ్యస్థానంగా నిలుస్తోంది. సాయంత్రం వేళల్లో గంగా హారతిని చూడవచ్చు, నదిలో పవిత్ర స్నానం చేయవచ్చు, పురాతన దేవాలయాలను సందర్శించవచ్చు. మానస దేవి ఆలయం, చండీ దేవి ఆలయం, రాజాజీ నేషనల్ పార్క్, గంగా హారతిని ఆస్వాదించవచ్చు.

7)జైపూర్ - పింక్ సిటీ: రాజస్థాన్ రాజధాని జైపూర్.. రాజ వారసత్వం, సంస్కృతి, చరిత్రకు నిలయం. ఇక్కడ అద్భుతమైన కోటలు, రాజభవనాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. హిస్టరీ, ఆర్కిటెక్చర్ లవర్స్‌తో పాటు రాజస్థానీ ఆతిథ్యాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని చూసే వారికి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్. అమెర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, హవా మహల్, జంతర్ మంతర్ (ఖగోళ అబ్జర్వేటరీ) చూడదగ్గవి.

8)లెహ్-లడఖ్: వేసవి అంటే గుర్తుకొచ్చేది ముందుగా జమ్ము కశ్మీర్‌లోని మంచు కొండలే. వేసవిని ఎంజాయ్ చేయాలని అనుకునే వారు లేహ్- లడఖ్‌కి తప్పనిసరిగా వెళ్లాల్సిన డెస్టినేషన్. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి అందాలు, మఠాలు, స్వచ్ఛమైన సరస్సులు ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రికులు, సాహస యాత్రికులను లేహ్- లడఖ్ ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడికి వెళ్తే పాంగాంగ్ సరస్సు(రంగులు మారే సరస్సు), ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి చెందిన నుబ్రా లోయ, మాగ్నెటిక్ హిల్ వంటివి టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి.

9)ఖజ్జియార్ మినీ స్విట్జర్లాండ్: హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఖజ్జియర్‌ను భారతదేశపు స్విట్జర్లాండ్‌గా పిలుస్తుంటారు. ఇక్కడ ఆకుపచ్చని పచ్చికబయళ్లు, మంచుతో కప్పబడిన పర్వతాలు స్విట్జర్లాండ్‌ని తలపిస్తుంటాయి.ప్రశాంతత, సాహసాలను అందించే ఖజ్జియార్..ప్రకృతి ప్రేమికులకు సరైన గమ్యస్థానంగా నిలుస్తోంది. పిక్‌నిక్, బోటింగ్‌ల కోసం ఖజ్జియర్ సరస్సు, కలతోప్ వన్యప్రాణుల అభయారణ్యం, ఖజ్జీ నాగ ఆలయం చూడదగ్గ ప్రదేశాలుగా ఉన్నాయి.

10)స్పితి లోయ సీక్రెట్ స్టోన్:ఇతర హిల్ స్టేషన్లతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ వైవిధ్యంగా ఉంటుంది. దీనిని సీక్రెట్ స్టోన్‌గా పిలుస్తుంటారు. అద్భుతమైన ప్రకృతి, పురాతన మఠాలతో పాటు హిమాలయ కొండల్లో అడ్వెంచర్స్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వారికి స్పితి వ్యాలీ సరైంది. కీ మొనాస్టరీ, చంద్రతాల్ సరస్సు, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ చూడదగ్గ ప్రదేశాలు.

 

Follow us on , &

ఇవీ చదవండి