Breaking News

మహానాడు మంగళవారం నుంచి కడప గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.

ఎటు చూసినా పసుపు జెండాలు.. పచ్చని తోరణాలు.. అడుగడుగునా పండగ వాతావరణం.. ఎవర్ని కదిలించినా ఉరకలెత్తే ఉత్సాహమే..


Published on: 27 May 2025 08:23  IST

కడపలో తెదేపా మహానాడు మంగళవారం ఘనంగా ప్రారంభం కానుంది. 2024 ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ మహాసభను పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం గగనాన్ని తాకుతోంది. గ్రామీణ వాతావరణంలో పసుపు జెండాలు, పచ్చ తోరణాలతో శిబిరం పండుగ వాతావరణంగా మారింది.

మూడవ రోజు గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. సభ ప్రాంగణం 140 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాహనాల పార్కింగ్ కోసం అదనంగా 450 ఎకరాల భూమిని కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది ప్రముఖులు కూర్చోనున్నారు. వర్షం కారణంగా ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మహానాడు ప్రాంతంలో 15 పడకలతో మెడికల్ క్యాంప్, అత్యవసర సేవలు అందించేందుకు ఐసీయూ వసతి, రక్తదానం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వృద్ధులకు కళ్లజోళ్ళు, వినికిడి పరికరాలు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించనున్నారు. పార్టీ చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇప్పటివరకు వున్న పద్ధతులకు భిన్నంగా ఈసారి ఆరు ముఖ్యాంశాలపై ప్రత్యేకంగా చర్చ జరుగనుంది. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, చర్చించనున్న అంశాలు ఇవే:

  1. కార్యకర్తే అధినేత

  2. యువగళం – యువత భవిష్యత్

  3. తెలుగుజాతి – ప్రపంచ ఖ్యాతి

  4. స్త్రీ శక్తి – మహిళా సాధికారత

  5. సామాజిక న్యాయం – పేదల అభివృద్ధి

  6. అన్నదాతకు అండ – వ్యవసాయం

మూడు రోజుల కార్యక్రమాలు ఇలా

మంగళవారం – మొదటి రోజు

  • ఉదయం ప్రతినిధుల నమోదు, ఫోటో ప్రదర్శన ప్రారంభం

  • పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన, సంతాపం

  • చంద్రబాబు ప్రసంగం, పార్టీ నియమావళిలో మార్పులు

  • "కార్యకర్తే అధినేత", "యువగళం" అంశాలపై చర్చలు

  • అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ

బుధవారం – రెండో రోజు

  • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళి

  • "తెలుగుజాతి - విశ్వ ఖ్యాతి", "స్త్రీ శక్తి", "సామాజిక న్యాయం" అంశాలపై చర్చ

  • వ్యవసాయం, సాగునీటి ప్రణాళికలపై దృష్టి

  • పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన

గురువారం – మూడవ రోజు

  • మధ్యాహ్నం బహిరంగ సభ

  • ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష

  • భవిష్యత్ లక్ష్యాలపై పార్టీ దిశానిర్దేశం

ఈ మహానాడు ద్వారా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా, ప్రజలతో మమేకమవడానికి, వారి కోసం సేవలతో ముందుకు వెళ్లేందుకు తెదేపా సిద్ధమవుతోంది. ప్రజాప్రతినిధులుగా తమ పాత్రను బలోపేతం చేయాలన్న సంకల్పంతో మూడురోజుల ఈ మహాసభ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది.

Follow us on , &

ఇవీ చదవండి