Breaking News

ఆపరేషన్‌ కగార్‌ నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టు అగ్రనేతల ప్రయత్నాలు..

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఛత్తీస్‌గఢ్‌ను మావోయిస్టుల రహిత రాష్ట్రంగా మారుస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా


Published on: 27 May 2025 08:39  IST

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు భారీ స్థాయిలో చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ మావోయిస్టులకు గట్టిపోటీ ఇస్తోంది. గత కొంతకాలంగా ఈ ఆపరేషన్‌ ప్రభావంతో మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా వయస్సు మీదపడ్డ నాయకులు ఇప్పుడు నడవడానికైనా ఇబ్బందిపడుతున్నారు. తాము నిలబడలేని పరిస్థితుల్లో, కనీసం ప్రాణాలతో బయటపడాలన్న మావోయిస్టు వర్గాలు గోప్యంగా ప్రభుత్వంతో లొంగుబాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఒక ముఖ్య నేత తరఫున లొంగుబాటుకు సంబంధించి ఇటీవల కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ వాటిపై ఇప్పటివరకు ఎటువంటి సానుకూల సంకేతాలు ఇవ్వలేదు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినట్లు, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఛత్తీస్‌గఢ్‌ను మావోయిస్టుల నుంచి పూర్తిగా విముక్తం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్ కగార్’ ముమ్మరంగా కొనసాగుతోంది.

2023లోనే 290 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోగా, దాదాపు 1,000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా 881 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. భద్రతా బలగాల దాడులు ఇప్పటికీ కొనసాగుతుండటంతో, ఈ ఏడాది ఇప్పటివరకు 180 మంది మావోయిస్టులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల మావోయిస్టుల ప్రభావం గల దండకారణ్యంలో మూడు భాగాల్లో భద్రతా బలగాల ఆధిపత్యం నెలకొంది.

భద్రతా ఒత్తిడికి లోనైన మావోయిస్టు నేతలు శాంతిచర్చల పిలుపు ఇచ్చారు. అంతేకాక, స్వచ్ఛందంగా కాల్పుల విరమణ కూడా ప్రకటించారు. ఈ చర్యలు, పార్టీ పునఃస్థాపన కన్నా, ప్రాణాలను కాపాడుకునే తపనగా కనిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఒక అగ్రనేత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి రహస్య రాయబారాన్ని కూడా పంపినట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రభుత్వాల నుంచి స్పందన లేకపోవడం పట్ల పౌరహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటి పరిస్థితుల్లో మావోయిస్టులను అరెస్ట్ చేయడం, లేదా స్వచ్ఛంద లొంగుబాటుకు అవకాశం ఇవ్వడం మంచిదని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి. తాము ఓడిపోయామన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చినప్పటికీ కాల్పులకు దిగడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మానవత్వంతో వ్యవహరించాలని, శాంతికి అవకాశమివ్వాలని పిలుపు ఇస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి