Breaking News

భూములను ప్రభుత్వం తాకట్టు పెడుతుందా? లేక అమ్మకానికి వెళుతుందా?

మామిడిపల్లి (బాలాపూర్ మండలం) మరియు రావిర్యాల (మహేశ్వరం మండలం) పరిధిలో కలిపి సుమారు 468 ఎకరాలు


Published on: 11 Apr 2025 11:55  IST

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిన భూములను అమ్మే అంశంపై దృష్టి సారించింది. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను తాకట్టు పెడితే సుమారు ₹10 వేల కోట్ల మేర ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, అదే భూములను నేరుగా అమ్మితే ఇంకా ఎక్కువ నిధులు రావచ్చని ప్రభుత్వం భావించింది.అయితే, ఈ నిర్ణయానికి HCU విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకత తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల మద్దతుతో పాటు పర్యావరణ సంరక్షణ వేత్తలు కూడా మద్దతు తెలుపడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిపోయింది. కేసు కోర్టులో ఉండటంతో ప్రస్తుతం వాటిని అమ్మే ప్రక్రియ నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పుడు మరొక స్థలంపై దృష్టి సారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో "ఐఎంజీ అకాడమీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్" సంస్థకు అప్పగించిన 468 ఎకరాల భూములపై తాజా కసరత్తు మొదలైంది. ఈ భూములు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం మరియు బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామాల్లో ఉన్నాయి.2003లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ భూములను చౌక ధరకు ఐఎంజీ సంస్థకు అప్పగించారు. అయితే 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయగా, సంస్థ కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా కోర్టులో వాదనలు వినిపించింది. గత ఏడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో భూములు ప్రభుత్వానికి చెందినవని తేలింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో కంచ గచ్చిబౌలిలో ఉన్న హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం మొదట దృష్టి పెట్టింది. కానీ వాటిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటం,అంతేకా కుండా తాము అధికారంలోకి రాగానే 400 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు చేస్తామని, రేవంత్‌ ప్రభుత్వం విక్రయించినా తిరిగి స్వాధీనం చేసుకుంటామని, వాటిని ఎవరూ కొనుగోలు చేయవద్దని కేటీఆర్‌ పార్టీపరంగా స్పష్టంచేయడంతో, పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మామిడిపల్లి, రావిర్యాల భూములపై ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.

ఈ భూములు టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత, చుట్టూ ఫెన్సింగ్ వేసి, టీజీఐఐసీకి చెందినవని బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే రెవెన్యూ శాఖ నుంచి అధికారిక బదలాయింపు మాత్రం ఇప్పటివరకు జరగలేదు.ఈ భూముల్లో సుమారు 200 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉండటం వల్ల, అధికారులు భారీ భద్రత మధ్య ఆ ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఈ భూముల్లో ఒక భాగం మహారాజ్ రాజాసింగ్ మనవరాలు షాలినికి చెందిందని సమాచారం. ఆమె ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం ఈ భూములపై స్పష్టత కోసం అన్ని రికార్డులను పరిశీలిస్తోంది. జిల్లా అధికారుల నుంచి మండల రెవెన్యూ అధికారులకు రికార్డులు సమర్పించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఎవరి పేర్లలో భూములు ఉన్నాయి? అసలు యజమానులు ఎవరు? అనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు జరుగుతోంది.రివ్యూ పూర్తయ్యాక టీజీఐఐసీకి భూముల అధికారిక బదలాయింపు జరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ భూములను ప్రభుత్వం తాకట్టు పెడుతుందా? లేక నేరుగా విక్రయించాలనుకుంటుందా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి