Breaking News

భక్తుల మధ్య ఘనంగా పూర్తైన మహాజాతర తొలి ఘట్టం

భక్తుల మధ్య ఘనంగా పూర్తైన మహాజాతర తొలి ఘట్టం


Published on: 29 Jan 2026 10:34  IST

లక్షలాది మంది భక్తుల ఎదురుచూపుల మధ్య సారలమ్మ తల్లి బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపైకి సంప్రదాయబద్ధంగా చేరుకున్నారు. ఆదివాసీ ఆచారాలు, డోలు మ్రోగింపులు, జయజయధ్వానాల నడుమ జరిగిన ఈ ఘట్టంతో మేడారం మహాజాతర తొలి దశ ప్రశాంతంగా ముగిసినట్లయింది.

కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ ఆలయం నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల 38 నిమిషాలకు అమ్మ ప్రయాణం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఊరేగింపుగా సాగుతూ 8 గంటల 48 నిమిషాలకు జంపన్నవాగు వద్దకు చేరుకున్నారు. అనంతరం వేలాది మంది భక్తుల నడుమ అమ్మను మేడారం గద్దె వద్ద ప్రతిష్ఠించారు. ఈ దృశ్యాలు భక్తులను భావోద్వేగానికి గురి చేశాయి.

ఉదయం నుంచే ప్రత్యేక పూజలు

సారలమ్మ ప్రయాణానికి ముందు బుధవారం ఉదయం నుంచే కన్నెపల్లి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు మొదలయ్యాయి. పూజారుల కుటుంబ సభ్యులు ఆలయాన్ని శుద్ధి చేసి, ముగ్గులు వేసి, మామిడి తోరణాలు, పూల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. సాయంత్రం వేళ అసలైన పూజా కార్యక్రమం ప్రారంభమైంది.

ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు ఇతర వడ్డెలు ఆలయం లోపల రహస్య పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆలయం బయట ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ అమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. శివసత్తులు శిగమూగడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

వేలాది భక్తుల భక్తిశ్రద్ధ

సారలమ్మ దర్శనం కోసం ఉదయం నుంచే వేలాది మంది భక్తులు కన్నెపల్లికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల వరకూ ఆలయం లోపల పూజలు కొనసాగాయి. ఆ తరువాత పూజారి కాక సారయ్య కుంకుమ భరిణతో బయటకు వస్తున్న సంకేతం అందగానే భక్తులంతా ఉలిక్కిపడ్డారు.

సంతానం లేని వారు పిల్లల కోసం మొక్కులు చెల్లించారు. మహిళలు హారతులు ఇస్తూ తడిబట్టలతో ఆలయం ముందు సాగిలపడ్డారు. గంటానాథం, బూరకొమ్ముల శబ్దాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

అడుగడుగునా నీరాజనాలు

పూజారి సారయ్య తల్లి రూపాన్ని తలపై పెట్టుకొని ఆలయం బయట అడుగు పెట్టగానే భక్తుల కేరింతలు మారుమోగాయి. దారి మధ్యలో భక్తులు పడుకుని మొక్కులు చెల్లించగా, వారి మీద పసుపు–కుంకుమ, అక్షింతలు, పవిత్ర జలాన్ని చల్లుతూ అమ్మ ముందుకు సాగింది.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు, రోప్‌ పార్టీలు వడ్డెలకు రక్షణ వలయంగా నిలబడి మార్గం కల్పించారు. కన్నెపల్లి గ్రామస్తులు తమ ఇళ్ల ముందు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. మహిళలు దారిపొడవునా నీళ్లు చల్లుతూ అమ్మను ఆహ్వానించారు. కొందరు కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

కన్నెపల్లి నుంచి మేడారం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులుతీరగా నిలబడి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.

జంపన్నవాగు వద్ద సంప్రదాయ పూజలు

జంపన్నవాగు చేరుకున్న తర్వాత అక్కడి ఒడ్డున జంపన్న తరఫున సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాగు దాటే సమయంలో భక్తుల జయజయధ్వానాలు ఆకాశాన్ని తాకాయి. వాగు అవతల ఒడ్డున ఉన్న నాగులమ్మ గద్దె వద్ద కూడా పూజలు జరిపారు.

అక్కడి నుంచి సారలమ్మను మేడారంలోని సమ్మక్క ఆలయానికి తీసుకువచ్చారు. అప్పటికే పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కల్యాణ తంతు పూర్తిచేశారు.

గద్దెపై సారలమ్మ ప్రతిష్ఠ

పూజలు ముగిశాక గోవిందరాజు, పగిడిద్దరాజుల తోడుగా సారలమ్మను మేడారం గద్దెపై ప్రతిష్ఠించారు. ఒకవైపు గోవిందరాజు, మరోవైపు పగిడిద్దరాజును వారి ప్రత్యేక గద్దెలపై నిలిపారు. దీంతో మేడారం మహాజాతర తొలి ఘట్టం విజయవంతంగా ముగిసింది. పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ముగ్గురు దేవతల దర్శనంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. వీరి ఆగమనంతో సమ్మక్క తల్లి రాకకు సంకేతం లభించినట్టయింది. గద్దెల ఆధునికీకరణ వల్ల ఈసారి భక్తులకు దర్శనం మరింత సులువైంది.

జంపన్నవాగులో విషాదం

జాతర తొలి రోజే విషాదం చోటుచేసుకుంది. జంపన్నవాగులో పుణ్యస్నానం చేస్తూ కిరణ్‌ (45) అనే భక్తుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆయన కుటుంబంతో కలిసి జాతరకు వచ్చి స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగింది. రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి కొంత దూరంలో మృతదేహాన్ని గుర్తించాయి. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

కోళ్ల వ్యాపారులకు నష్టం

జాతర ప్రారంభ రోజునే పలు దుకాణాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. వైరస్ ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. మృతి చెందిన కోళ్లను ఖననం చేశారు. ఒక్కరోజులోనే భారీ నష్టం వాటిల్లడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న కోళ్లను సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

సమ్మక్క తల్లి రాకకు సిద్ధం

కోట్లాది మంది ఎదురుచూస్తున్న వనదేవత సమ్మక్క గురువారం మేడారం గద్దెపైకి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమ్మక్క రాకతో మహాజాతర అత్యున్నత స్థాయికి చేరనుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పూజారులు, అధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. సమ్మక్క ఆలయం, గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి