Breaking News

పాత పన్ను విధానానికి గుడ్‌బైనా? లేక మార్పులా?

పాత పన్ను విధానానికి గుడ్‌బైనా? లేక మార్పులా?


Published on: 29 Jan 2026 10:54  IST

త్వరలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై సామాన్య ప్రజలు ఇప్పటికే పెద్ద అంచనాలే పెట్టుకున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య తమకు కొంత ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం పన్ను విధానంలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా వేతన జీవులకు పన్ను భారం తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకోవడంతో మధ్యతరగతి వర్గాలు లాభపడ్డాయి. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేల వరకు పెంచడం, సెక్షన్ 87ఏ కింద ఇచ్చే రిబేట్‌ను గణనీయంగా పెంచడం వల్ల చాలా మందికి ఆదాయపు పన్ను భారమే లేకుండా పోయింది. ఫలితంగా, వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా మారింది.

పాత పన్ను విధానం కొనసాగుతుందా?

అయితే, ఈ మార్పులన్నీ కొత్త పన్ను విధానానికే పరిమితమయ్యాయి. పాత పన్ను విధానాన్ని అనుసరిస్తున్న వారికి మాత్రం ఎలాంటి అదనపు ప్రయోజనాలు అందలేదు. పాత విధానంలో ఉన్న పన్ను స్లాబ్స్, డిడక్షన్లు, మినహాయింపులు అన్నీ యథాతథంగానే కొనసాగాయి. దీంతో పాత విధానాన్ని ఎంచుకున్న వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగిస్తారా? లేక దానిలో కీలక మార్పులు చేస్తారా? అన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బడ్జెట్‌లో స్పష్టత వస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

పాత విధానంలో మార్పులపై చర్చ

పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, గృహ రుణ వడ్డీపై మినహాయింపు (సెక్షన్ 24బీ), ఎన్పీఎస్ ప్రయోజనాలు వంటి అంశాల్లో చాలా ఏళ్లుగా ఎలాంటి మార్పులు జరగలేదు. అందుకే ఈసారి అయినా ప్రభుత్వం ఈ డిడక్షన్లు, మినహాయింపులను పెంచుతుందా? లేక పాత విధానానికి ముగింపు పలుకుతుందా? అన్న సందేహాలు పెరిగాయి.

కొత్త పన్ను విధానంలో కొత్త ఆలోచనలు?

మరోవైపు, కొత్త పన్ను విధానంలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు చేసే వారికి కొంత ప్రయోజనం కలిగించేలా పరిమిత మినహాయింపులు చేర్చే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది. ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లాన్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టే వారికి మేలు చేసేలా కొత్త పన్ను విధానంలో సమతుల్యత తీసుకురావాలని కేంద్రం ప్రయత్నించే ఛాన్స్ ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

ఆదాయపు పన్ను వ్యవస్థలో సవాళ్లు

పన్ను విధానంతో పాటు ఆదాయపు పన్ను ప్రక్రియలో ఉన్న సమస్యలపై కూడా ఈసారి బడ్జెట్‌లో దృష్టి సారించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఐటీఆర్ ప్రాసెసింగ్ ఆలస్యం, రిఫండ్‌లు రావడంలో జాప్యం, ఏఐఎస్ కంప్లయెన్స్ సమస్యలు, టీడీఎస్‌కు సంబంధించిన గందరగోళం, తరచూ వచ్చే ఐటీ నోటీసులు వంటి అంశాలు పన్ను చెల్లింపుదారులను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి.

ఈ సమస్యల వల్ల వేతన జీవులతో పాటు ఫ్రీలాన్సర్లు, పదవీ విరమణ చేసిన వారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాలపై బడ్జెట్‌లో స్పష్టమైన పరిష్కారాలు ప్రకటించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

వృద్ధులకు ప్రత్యేక ప్రయోజనాలపై ఆశలు

కొత్త పన్ను విధానంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా లాభాలు లేకపోవడంపై కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల కోసం ప్రత్యేక పన్ను స్లాబ్స్, అధిక రిబేట్‌లు, వైద్య ఖర్చులకు సంబంధించిన మినహాయింపులు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

భారీ పన్ను కోతలు ఉండకపోవచ్చు

అయితే, ఈసారి బడ్జెట్‌లో పెద్ద ఎత్తున పన్ను కోతలు ఉండే అవకాశం తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. బదులుగా కొత్త పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా చూస్తే, ఈ ఏడాది బడ్జెట్‌లో పన్ను విధానంపై కీలక నిర్ణయాలు వచ్చే అవకాశముంది. అవి సామాన్యుడికి ఎంతవరకు ఊరటనిస్తాయో అన్నది బడ్జెట్ రోజు స్పష్టమవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి