Breaking News

నరసాపురం జగన్నాథస్వామి ఆలయంలో అపశృతి – భక్తుల ఆందోళన

నరసాపురం రుస్తుంబాదలోని 600 ఏళ్ల చరిత్ర కలిగిన జగన్నాథస్వామి ఆలయంలో ఓ అవాంఛనీయ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.


Published on: 02 Apr 2025 23:55  IST

నరసాపురం రుస్తుంబాదలోని 600 ఏళ్ల చరిత్ర కలిగిన జగన్నాథస్వామి ఆలయంలో ఓ అవాంఛనీయ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని మూలవిరాట్ జగన్నాథస్వామి విగ్రహం స్వల్పంగా పక్కకు ఒరిగినట్లు భక్తులు గుర్తించారు. పూరీ జగన్నాథ ఆలయ శైలిలో నిర్మితమైన ఈ ఆలయంలో జగన్నాథ, బలరామ, సుభద్రా దేవతలు కొలువై ఉన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా దేవదాయశాఖ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఆలయ నిర్వహణ ప్రభావితమైంది. భక్తుల అభిప్రాయం ప్రకారం, అధికారుల అలక్ష్యమే విగ్రహం ఒరగడానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఆలయం తెరిచిన అనంతరం పూజల సమయంలో ఓ భక్తుడు విగ్రహం మార్పును గమనించి వెంటనే స్థానికులకు తెలియజేశాడు. దీంతో భక్తులు ఆలయ ఇన్‌చార్జ్ ఈవో లోకేష్‌ను సంప్రదించి స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ ఆలయం డచ్, బ్రిటీష్ కాలాల్లోనూ, మొగల్తూరు రాజవంశీయుల పాలనలోనూ గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆలయ నిర్వహణ కోసం భక్తులు అనేక ఎకరాల భూములు దానం చేసినప్పటికీ, దేవదాయశాఖ దీనిని గాలికొదిలేసిందని భక్తులు మండిపడుతున్నారు. విగ్రహం గతంలోనే పక్కకు ఒరిగి ఉండొచ్చని, ఇప్పటివరకు అధికారుల అలక్ష్యంతో ఈ విషయం బయటకు రాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి