Breaking News

55 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం.

నెల్లూరు నగరపాలక సంస్థలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. 55 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.


Published on: 04 Apr 2025 00:09  IST

నెల్లూరు (నగరపాలక సంస్థ): నెల్లూరు నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. వీటి ఆధారంగా తాజాగా ప్రభుత్వం 55 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం కలకలం రేపుతోంది.

2022 ఏప్రిల్ 28, 29 తేదీల్లో ఏసీబీ అధికారులు ప్రజారోగ్య విభాగంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అర్థరాత్రి వరకు పలు దస్త్రాలను పరిశీలించి, వాణిజ్య అనుమతులు, ట్రేడ్ లైసెన్సుల వ్యవహారాన్ని గమనించారు. నగరంలో 25,000 దుకాణాలు ఉన్నా, కేవలం 11,000 దుకాణాల నుంచే ఫీజు వసూలైనట్లు తేలింది. ప్రభుత్వ  ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా చేసి తమ జేబులు నింపుకొన్న వైనం బయటపడింది.అప్పటి వైకాపా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక అందజేసినా, రాజకీయ సంబంధాల కారణంగా మూడు సంవత్సరాలుగా ఈ అంశం మరుగున పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే నగరపాలక సంస్థలో జరిగిన తప్పులపై దృష్టిసారించింది,ఒకేసారి 55 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

తనిఖీల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొరుగు సేవల కంప్యూటర్ ఆపరేటర్ వద్ద అనధికారికంగా రూ.4,700 స్వాధీనం చేసుకోగా, ఆ డబ్బు ఎఫ్-3 క్లర్క్‌దని పేర్కొన్నారు. అదేవిధంగా, ఎఫ్-1 క్లర్క్ హ్యాండ్ బ్యాగులో రూ.3,800 ఉన్నట్లు గుర్తించారు. వాణిజ్య సముదాయాలు, కళాశాలలు, బహుళ అంతస్తుల భవనాలకు గెజిట్ ప్రకారం కాకుండా చాలా తక్కువ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేసినట్లు తేలింది.

ప్రైవేట్ వ్యక్తి వద్ద శానిటరీ ఇన్‌స్పెక్టర్ల ఈ-ఆఫీస్ డిజిటల్ 'కీ' కనుగొనడం నిజంగా ఆశ్చర్యకరం. దీని ద్వారా ఆయన నేరుగా ఎన్వోసీలు, శానిటరీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు తేలింది. మొత్తం 20 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లలో కొంతమంది ఈ డిజిటల్ కీ వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. ప్రజారోగ్య విభాగంలో 1400 మంది పైగా ఉద్యోగులు ఉండగా, 70% మాత్రమే విధులకు హాజరవుతున్నా, 100% హాజరైనట్లు రికార్డుల్లో చూపినట్లు తేల్చారు.

ఈ స్కామ్‌పై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ, పాలక సంస్థలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. 55 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ చర్యలతో నగర పాలక సంస్థలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం!

Follow us on , &

ఇవీ చదవండి