Breaking News

మంగళవారం అర్ధరాత్రి అల్లూరు రోడ్ స్టేషన్ సమీపంలో దొంగలు రైళ్లను నిలిపేసి, ప్రయాణికుల వద్ద దోపిడీ

దోపిడీ దొంగలు కొత్తగా రూటు మార్చారు. గతంలో చైన్ లాగడం, చిన్న దొంగతనాలకే పరిమితమైన ఈ ముఠాలు, ఇప్పుడు రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసేంతగా బరితెగిస్తున్నారు


Published on: 03 Apr 2025 23:08  IST

నెల్లూరులో రైల్వే దోపిడీ ముఠాల హల్‌చల్

నెల్లూరు: దోపిడీ దొంగలు కొత్తగా రూటు మార్చారు. గతంలో చైన్ లాగడం, చిన్న దొంగతనాలకే పరిమితమైన ఈ ముఠాలు, ఇప్పుడు రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసేంతగా బరితెగిస్తున్నారు . మంగళవారం అర్ధరాత్రి అల్లూరు రోడ్ స్టేషన్ సమీపంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. దొంగలు రైళ్లను నిలిపేసి, ప్రయాణికుల వద్ద ఉన్న విలువైన వస్తువులను అపహరించేందుకు ప్రయత్నించారు. ఇదే ప్రాంతంలో ఇంతకుముందు కూడా దొంగతనాలు జరిగినా, రైల్వే సిబ్బంది తీసుకున్న చర్యలు పెద్దగా ప్రభావితం కాలేదు.

పోలీసు రికార్డుల ప్రకారం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర దొంగ ముఠాలే ప్రధానంగా రైళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఒక్కో ముఠాలో 5 నుంచి 8 మంది వరకు సభ్యులు ఉంటారు, వీరిలో మహిళలు కూడా భాగమవుతారు. ప్రయాణికుల ఏమరుపాటును ఉపయోగించుకుని, రైళ్లు ఆగిన వెంటనే బ్యాగులు, నగలు, సెల్‌ఫోన్లు లాక్కొని పారిపోతున్నారు. విజయవాడ రైల్వే జంక్షన్ పరిధిలో ప్రతిరోజూ 15 నుంచి 20 మంది వరకు తమ వస్తువులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, దీనిపై చెప్పుకోదగ్గ పురోగతి మాత్రం కనిపించడం లేదు.

పోలీసులకు సవాలు

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రోజూ 120 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా, భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచలేదు. గత పదేళ్లలో రైళ్ల సంఖ్య పెరిగినా, రైల్వే భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచలేదు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం సిబ్బంది కొరత తీవ్రమైందని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ పరిధిలో 32 మంది సిబ్బంది అవసరమైతే, కేవలం 18 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనలపై రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రి సమయంలో బీట్లు పెంచేందుకు, స్టేషన్ల వద్ద డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని బోగీల్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు తిప్పజేస్తూ ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి