Breaking News

కేంద్రం సహకారంతో అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు, కొత్త రైల్వే లైన్ సహా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. 140 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Published on: 03 Apr 2025 14:07  IST

అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టుకు కీలక మార్పులు – కేంద్రం గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి సంబంధించిన కీలక ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లుతోంది. కేంద్ర సహాయంతో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), కొత్త రైల్వే లైన్ తదితర ప్రాజెక్టులకు మంజూరు లభించింది. తాజాగా, అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులో ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది.

మొదట 70 మీటర్ల వెడల్పుతో ప్లాన్ చేసిన ఓఆర్‌ఆర్‌ను, ఏపీ ప్రభుత్వం 140 మీటర్లకు విస్తరించాలని కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపి, భూ సేకరణ ప్రక్రియను వేగంగా ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది.ప్రభుత్వం భవిష్యత్తులో రైల్వే లైన్, రహదారి విస్తరణ పనులకు అనువుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీను కలిసి విజ్ఞప్తి చేయడంతో, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.

ప్రాజెక్టు మార్పులు – వెడల్పు, వ్యయం పెంపు

2018లో టీడీపీ ప్రభుత్వం అమరావతి ఓఆర్‌ఆర్‌ను 150 మీటర్ల వెడల్పుతో ప్లాన్ చేసింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు 189.4 కి.మీ పొడవుతో, 6 లైన్లుగా నిర్మించాలని నిర్ణయించింది. ఆ సమయంలో ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూమిని సేకరించాలని సూచించింది. కానీ, ప్రస్తుతం 140 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది, దీంతో భవిష్యత్తులో 10 లైన్ల రహదారి నిర్మాణం కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మొదట ఓఆర్‌ఆర్‌కు రాజధాని వైపు మాత్రమే సర్వీస్ రోడ్డు నిర్మించాలని కేంద్రం అనుమతించింది.అయితే, రెండు వైపులా సర్వీస్ రోడ్లు అవసరమని చంద్రబాబు నాయుడు గడ్కరీతో చర్చించి, చివరికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మార్పుతో గ్రామాలు, పట్టణాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది.

ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం

ప్రారంభ అంచనాల ప్రకారం, అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి రూ.16,310 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు.అందులో సివిల్ పనుల ఖర్చు రూ.12,955 కోట్లు,భూసేకరణకు రూ.2,665 కోట్లు కాగా,ఈ లెక్క 70 మీటర్ల వెడల్పుతో భూమిని తీసుకుంటే మాత్రమే వర్తిస్తుంది.ప్రస్తుతం 140 మీటర్ల వెడల్పు భూమిని తీసుకోవడంతో భూసేకరణ వ్యయం పెరిగే అవకాశం ఉంది.తొందరలో మోర్త్ (MORTH) నుంచి వచ్చే అధికారిక ఆదేశాల్లో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి