Breaking News

హైదరాబాద్‌కు జాన్ సీనా..!

హాలీవుడ్ హీరో, డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా.. హైదరాబాద్‌కు వస్తున్నాడు. ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ షో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనిలో పాల్గొనేందుకు తాను భారత్‌కు వస్తున్నట్లు జాన్ సీనా స్వయంగా ప్రకటించాడు.


Published on: 23 Aug 2023 15:17  IST

అంతకుముందు 2017లో ఒకసారి భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరిగింది. ఆ తర్వాత మళ్లీ భారత్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. ఈ సూపర్ స్పెక్టేకిల్‌లో తను కూడా పాల్గొంటున్నట్లు జాన్ సీనా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించాడు. మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యామిలీతో కలిసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానంటూ జాన్ సీనా పోస్టు చేశాడు.

'స్మాక్‌డౌన్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ కుటుంబంతో కలిసేందుకు ఆగలేకపోతున్నా. మరీ ముఖ్యంగా భారత్‌లోని డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్‌ను కలిసేందుకు.. అక్కడ రెజ్లింగ్ చేసేందుకు చాలా ఎగ్జయిట్ అవుతున్నా. దానికి ఇదే సరైన సమయం. త్వరలోనే అందర్నీ కలుస్తా' అని జాన్ సీనా చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.గతంలోనే భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొనే భారతీయ సూపర్ స్టార్లతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలని డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుందట. కానీ అది జరగలేదు. అయితే ఈ షో సూపర్ స్టార్ 'గ్రేట్ ఖాలి'తో ఒక ప్రమోషనల్ ప్రోగ్రాం మాత్రం నిర్వహించారు. అదే చివరగా డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించిన భారత్‌లో జరిగిన ఈవెంట్.

ఇక ఇప్పుడు ఇలా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా కూడా భారత్‌కు వస్తున్నాడని తెలిసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. తమ అభిమాన స్టార్‌ను స్వయంగా చూసే అవకాశం దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాన్ సీనాను చూసేందుకు తాము కచ్చితంగా వస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వార్త విన్న దగ్గరి నుంచి దేశీ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి