Breaking News

పది మెమోలలో ప్రతి సబ్జెక్టుకు విడివిడిగా వచ్చిన మార్కులు, గ్రేడ్లు మాత్రమే ముద్రిస్తున్నారు.

ప్రస్తుతం అందజేస్తున్న మెమోలలో ప్రతి సబ్జెక్టుకు విడివిడిగా వచ్చిన మార్కులు, గ్రేడ్లు మాత్రమే ముద్రిస్తున్నారు. మొత్తం పొందిన మార్కులు ఎంత? మొత్తం గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ ఎంత? అన్నది ఎక్కడా చూపడం లేదు.


Published on: 02 May 2025 12:06  IST

హైదరాబాద్‌: పదో తరగతి మెమో (తాత్కాలిక రిపోర్ట్ కార్డ్)లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఈ సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే మెమోలలో మొత్తం మార్కులు గానీ, మొత్తం సీజీపీఏ (Cumulative Grade Point Average) గానీ చూపించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిగా ఉన్నారు.

ప్రస్తుతం అందజేస్తున్న మెమోలలో ప్రతి సబ్జెక్టుకు విడివిడిగా వచ్చిన మార్కులు, గ్రేడ్లు మాత్రమే ముద్రిస్తున్నారు. మొత్తం పొందిన మార్కులు ఎంత? మొత్తం గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ ఎంత? అన్నది ఎక్కడా చూపడం లేదు. దీని వల్ల విద్యార్థులు తమ పూర్తిస్థాయి ప్రదర్శనను అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది.గతంలో ఇంటర్నల్స్‌పై తీసుకున్న నిర్ణయాలు కూడా మారి మారి వచ్చాయి. మొదట ఇంటర్నల్స్ రద్దు చేసిన ప్రభుత్వం, తర్వాత మళ్లీ ప్రవేశపెట్టింది. ఇలా విద్యా సంవత్సరానికి మధ్యలో విధానాలు మారడం వల్ల ఇప్పటికే గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, విద్యా నిపుణులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ఇంటర్, డిగ్రీ మెమోలపై ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి వంటి వివరాలు ఉండగా.. పదో తరగతి మెమోలపై మాత్రం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు" అని రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.విద్యార్థుల భవిష్యత్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మెమోలపై మొత్తం మార్కులు లేదా సీజీపీఏ చూపించేలా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలో ముద్రించనున్న షార్ట్‌ మెమోలు, లాంగ్‌ మెమోలు ఇచ్చే లోపు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి