Breaking News

పాక్‌లో ప్రజాస్వామ్యానికి తెరపడిందా? ప్రభుత్వాధికారం సైన్యం చేతుల్లోకి?

పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేశారా? భారత్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో విధాన నిర్ణయమంతా సైన్యం, ఇంటెలిజెన్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Published on: 02 May 2025 12:58  IST

ఇస్లామాబాద్‌, మే 1: పాకిస్థాన్‌ రాజకీయాల్లో మరోసారి సైనికాధిపత్యం స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం పాత్ర తక్కువై, ముఖ్యమైన నిర్ణయాలు సైన్యం, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.తాజాగా ఐఎస్‌ఐ డైరెక్టర్‌గా ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ మహమ్మద్‌ అసిమ్‌ మాలిక్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా కూడా నియమించడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఒకేసారి రెండు కీలక పదవులు ఒకే వ్యక్తికి ఇవ్వడం పాక్‌ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి షరీఫ్‌ గత కొన్ని రోజులుగా పబ్లిక్‌గా కనిపించకపోవడం, భారత్‌తో ఉద్రిక్తతలపై స్పందన రాకపోవడం, అంతర్గత విషయాల్లోనూ వెనుకబడ్డట్లు కనిపించడంతో అధికారంలో ఆయన పాత్రపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

పాక్‌లోని రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, ఇది అధికార మార్పు కాదు కానీ, మిలిటరీ ప్రభావం మళ్లీ పెరిగినదే. ప్రజాస్వామ్యం ఒక ముసుగుగా ఉండి, అసలు నిర్ణయాధికారం సైన్యానికి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, గతంలోనూ విదేశాంగ, రక్షణ, వ్యూహాత్మక విధానాల్లో సైనిక శాఖలే కీలకంగా ఉండేవి.

భారత్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ రాజస్థాన్‌ సరిహద్దులో తన బలగాలను క్రమంగా మోహరిస్తోంది. లాంగెవాలా ప్రాంతంలో రాడార్ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, భద్రతా సిబ్బంది మోహరించబడ్డారని సమాచారం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ యూనిట్లను సరిహద్దులకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

కరాచీ, లాహోర్‌ గగనతలంపై పాక్షికంగా ఆంక్షలు విధించారని పాక్‌ ప్రభుత్వం తెలిపింది. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు కొన్ని విమాన మార్గాలపై నిర్బంధాలు అమలులో ఉంటాయని పేర్కొంది. అయితే, వాణిజ్య విమానాల రాకపోకలకు ఈ ఆంక్షలు వర్తించవని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించనున్నట్లు పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి